TG : 17న హైదరాబాద్ లో రాజకీయ ర్యాలీలపై నిషేధం

గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న జరగనున్న శోభాయాత్ర నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. జంట నగరాల్లో జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాలపై వివిధశాఖల అధికారులతో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. సెప్టెంబరు 17న ఉదయం 6 నుంచి 18న సాయంత్రం 6 గంట వరకు మద్యం అమ్మకాలు కూడా హైదరాబాద్ నగరంలో నిషేదిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై మద్యం షాపులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు.
హిందూ, ముస్లింల పండుగలు ఒకేరోజు ఉన్నందున రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని పార్టీలకు సూచించారు. నిమజ్జన యాత్రను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పండుగులను సంతోషంగా, సామరస్యంగా జరుపుకునేందుకు ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com