TG : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తయ్

TG : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తయ్
X

కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారని ఆరోపించారు. శేరిలింగంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లమని అన్నారని గుర్తు చేశారు. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేదన్నారు. కేసీఆరే దశమ గ్రహం.. నవగ్రహ హోమం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్‌కు ‘నో ఎంట్రీ బోర్డు’ పెట్టేశారని, ఇగ రీ ఎంట్రీ కలే అంటూ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు.. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నరని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను తాను సన్మానిస్తానని, ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యమన్నారు. సభ్యత్వ నమోదు విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. ఇన్సూరెన్స్, ఇతర తాయిలాలు ఆశ చూపకుండా సభ్యత్వ నమోదు చేస్తోందన్నారు. బీజేపీ జాతీయవాద భావాలున్న పార్టీ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలోని 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.

Tags

Next Story