Talsani Srinivas Yadav : బీసీలు తలుచుకుంటే భూకంపం పుట్టిస్తారు

రాజకీయంగా బీసీలను విడదీసే కుట్ర జరగుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. సాధ్యం కాని విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. బీసీలు తలుచుకుంటే రాజకీయ భూకంపం పుట్టిస్తామన్నారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఒక్కతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి సీఎం రేవంత్ మోసం చేశారని ఆరోపించారు.
అంతకుముందు పండుగలకు సంబంధించి ప్రభుత్వంపై తలసాని విమర్శలు గుప్పించారు. నిర్బంధాల మధ్య పండుగలను జరపడం కరెక్ట్ కాదని అన్నారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద తాము ఎదుర్కొన్న సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్బంధాల మధ్య పండుగలు, జాతరలను నిర్వహించడం వల్ల భక్తులు ఇబ్బందులు పడతారని తెలిపారు. 2014 నుంచి భక్తులు ఇబ్బందులు కలగకుండా పండుగలు నిర్వహించామని గుర్తు చేశారు. బోనాలను సంతోషంగా జరుపుకునే విధంగా తాము అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహించామని చెప్పారు. పలారం బండి ఊరేగింపులో చాలా ఆటంకాలు జరుగుతున్నాయని.. అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com