Telangana : మండుతున్న ఎండలు.. రెండ్రోజులు జాగ్రత్త!

Telangana : మండుతున్న ఎండలు.. రెండ్రోజులు జాగ్రత్త!
X

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు మండుతాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో41.4 డిగ్రీలు, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో 40.3 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా రామగుండం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 40 డిగ్రీలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో 39.2 డిగ్రీలు, నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది. కాగా.. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూలు, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 14 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Tags

Next Story