BRS: ఇక అసెంబ్లీల వారీగా సమీక్ష సమావేశాలు

BRS: ఇక అసెంబ్లీల వారీగా సమీక్ష సమావేశాలు
సిద్ధమవుతోన్న బీఆర్‌ఎస్‌... లోక్‌సభ ఎన్నికలను పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యం...

అసెంబ్లీ పోరులో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి... త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సర్వశక్తులు కూడదీసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. వచ్చేనెల మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోనుంది. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుతోపాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది.


బీఆర్‌ఎస్‌ ఇప్పటికే లోక్‌సభ నియోజవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సోమవారంతో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఒక్కో అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి సగటున 70 నుంచి వంద మంది వరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు వచ్చిన నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాలను తెలుసుకోవడం, పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యచరణపై సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. కొద్ది మంది నేతలు సమావేశంలో బహిరంగంగా తమ అభిప్రాయాలు తెలపగా... మిగిలిన వారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా.. కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. అన్ని స్థాయిల్లోనూ పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తామని... కార్యకర్తలు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తామని ముఖ్యనేతలు హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయాలను క్రియాశీలం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వంచి కార్యక్రమాలు చేపట్టేందుకు భారాస సిద్ధమవుతోంది.


తొమ్మిదిన్నరేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, కాంగ్రెస్ హామీలు, వాటి అమలులో లోపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు. స్వేదపత్రంలోని అంశాలను చెప్పడంల, హామీల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. KCR ముఖ్యమంత్రిగా లేని లోటు క్షేత్రస్థాయిలో తెలిసివస్తోందని నేతలు వివరించారు. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓటమి పాలైందని..నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్‌సభలో భారాస సభ్యులు ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ, హక్కుల కోసం పోరాటం కేవలం గులాబీ పార్టీతోనే సాధ్యమనే విషయాన్ని విడమర్చి చెప్పాలని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story