Telangana Municipal Chairman Polls : చైర్మన్ పదవుల కోసం పార్టీల పొత్తులు.. ఇవేం చిత్రాలు.

Telangana Municipal Chairman Polls : చైర్మన్ పదవుల కోసం పార్టీల పొత్తులు.. ఇవేం చిత్రాలు.
X

తెలంగాణ మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిరోజూ తిట్టుకునే పార్టీలు చైర్మన్ పదవుల కోసం కలిసిపోయాయి. ఇదే అందరికీ చిత్రవిచిత్రంగా అనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ అంటేనే దేశ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పొద్దున లేస్తే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు ఆ పార్టీల నేతలు. కానీ విచిత్రంగా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ఆ రెండు పార్టీలు చాలా చోట్ల కలిసిపోయాయి. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల హంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ హంగ్ వచ్చిన నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ జత కట్టింది. అక్కడ బీఆర్ ఎస్ ను దెబ్బ కొట్టేందుకు ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుని పవర్ షేర్ చేసుకున్నాయి.

రాయికల్ మున్సిపాలిటీ కోసం కాంగ్రెస్ పార్టీతో బీఆర్ ఎస్ పొత్తులు పెట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ రెండు పార్టీలు రాబోయేది తమ ప్రభుత్వాలే అంటూ ఢీ అంటే ఢీ అంటుంటాయి. అలాంటి పార్టీలు మున్సిపాలిటీ వరకు మాత్రం కలిసిపోయాయి. కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ కలిసి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. ఇక్కడ బీజేపీని దెబ్బకొట్టేందుకు ఇలా చేశాయి.

ఇవే కాదు రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో ఇలాంటి విచిత్ర పొత్తులు కలిశాయి. అధినేతలు మాత్రం.. తమకు అక్కడ సంబంధం లేదని.. అక్కడి కౌన్సిలర్లకే వదిలేశామని చెబుతున్నారు. కౌన్సిలర్లు కలిసిపోతే అది అక్కడి వరకు మాత్రమే అని.. అది రాష్ట్రమంతా కాదని చెబుతున్నారు. ఇది చూసిన వారందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తోంది. పొద్దున లేస్తే పొట్టుపొట్టు తిట్టుకునే పార్టీలు ఇలా కలిసిపోవడం ఏంటని ఆశ్చపోతున్నారు ఓటర్లు.

Tags

Next Story