ఏపీలో సరికొత్త ఫార్ములాతో ముందుకెళ్తోన్న బీజేపీ!

ఏపీలో బీజేపీ సరికొత్త ఫార్ములాతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరగకుండా ముందుగానే అప్రమత్తమైన అధిష్ఠానం రంగంలోకి కొత్త ట్రబుల్ షూటర్లను దించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో వర్కవుట్ అయిన ఫార్ములాతో ఏపీలోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ నేతలు కామెంట్స్ చేయడం వెనుక ఏదో జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దించబోతున్న బీజేపీ.. అక్కడ విజయం సాధించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కమలం గాలి వీచేలా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. హిందు దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. దేవాలయాలపై దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ రెండు కొండలు అంటోందని.. గోవిందుడివే ఏడు కొండలు అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్టికులర్‌గా ఏపీ రాజకీయాలపై ఎందుకు మాట్లాడారు..? ఎప్పుడూ లేనిది బండి సంజయ్ ఎపీపై ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు..? తిరుపతి ఉప ఎన్నిక టార్గెట్‌గా ఏపీపై బీజేపీ హైకమాండ్ గురిపెట్టిన అస్త్రమేనా..? ఈ ప్రశ్నలన్నటికీ బీజేపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.. దుబ్బాకలో బీజేపీ దమ్ము చూపించిన బండి సంజయ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఊహించని విజయాన్ని కట్టబెట్టడంతో ఆయన హైకమాండ్ దృష్టిలో పడ్డారు.. తిరుపతి ఉప ఎన్నిక కోసం బండి సంజయ్‌ని రంగంలోకి దింపుతున్నట్లుగా సమాచారం. మొదట సంజయ్‌తో ప్రచారం చేయించాలని భావించగా.. అంతకు ముందుగానే తిరుపతి పంపి హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి రిహార్సల్స్‌గానే బండి వ్యాఖ్యలను చూడాలనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లుగానే ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లుగా విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఏపీలో బీజేపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నేతలు స్పందిస్తున్న తీరు పట్ల కేంద్ర నాయకత్వం అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ లాంటి నేతలను బరిలోకి దించి ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీని చూపించాలనే అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.. రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో మరింత కీలకంగా మారనుందనే చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com