BJP: తెలంగాణపై బీజేపీ నజర్..!

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న కిషన్‌రెడ్డి.. ఢిల్లీకి వెళ్లారు. ఈటల, రాజగోపాల్‌రెడ్డితో నిర్వహించనున్న భేటీలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.ఇందులో రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది. నేతల మధ్య గ్యాప్ తగ్గించేందుకు చర్యలపై కిషన్ రెడ్డితో చర్చించే అవకాశం కన్పిస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ కాస్త డీలా పడినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి అసంతృప్త నేతలను బుజ్జగించే పనిపై బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని ఢిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ బీజేపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com