Eetala Rajender : ఈటలకే బీజేపీ పగ్గాలు దక్కే చాన్స్

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియను బీజేపీ జాతీయ నాయకత్వం వేగవంతం చేసింది. రానున్న రెండువారాల్లో గా తెలంగాణ బీజేపీకి నూతన రథసారథి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. అయితే అధ్యక్ష పదవి కోసం పోటీలో పలువురు ముఖ్య నేతలు ఉండడంతో అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఆయనను ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతుండగా, హైదరాబాద్లో బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ భన్సల్ రెండు రోజులపాటు కీలక నేతలతో చర్చలు జరిపారు. చివరికి ఏకాభిప్రాయంతో ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావుకు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు అందింది. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం నేపథ్యంలో రాంచందర్ రావుకు జాతీయ నాయకత్వం పిలుపుపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు కూడా ఉన్నట్టు ఆయన వర్గం చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com