Lankala Deepak Reddy : జూబ్లీహిల్స్ ప్రచారంలో వెనకబడ్డ బీజేపీ.. ఇలా అయితే కష్టమే..

Lankala Deepak Reddy : జూబ్లీహిల్స్ ప్రచారంలో వెనకబడ్డ బీజేపీ.. ఇలా అయితే కష్టమే..
X

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలకు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి మొదటి ఉప ఎన్నిక కాగా.. బీఆర్ ఎస్ కు సిట్టింగ్ స్థానం. అటు బీజేపీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వచ్చే స్థానం ఇది. పైగా ఈ ఉప ఎన్నిక ఏ పార్టీకి ఎంత ఇమేజ్ పెరిగిందో తేల్చి చెప్పేదిగా భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో ఈ ఉప ఎన్నిక తేలుస్తుందనే ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం చాలా వెనకబడిపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ జూబ్లీహిల్స్ లో బీజేపీ సందడి పెద్దగా కనిపించట్లేదు. ఓ వైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతున్నాడు.

ఇంకోవైపు బీఆర్ ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ వేయగా.. కేటీఆర్, హరీష్‌ రావు, మాజీ మంత్రులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కూడా వేయలేదు. నామినేషన్ కు రేపే లాస్ట్ డేట్. చివరి రోజున వేసే అవకాశం ఉంది. వాస్తవానికి అభ్యర్థి ముందే నామినేషన్ వేసేసి ప్రచారంపై ఫోకస్ పెట్టాలి. కానీ దీపక్ రెడ్డి నామినేషన్ ఆలస్యంగానే వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారం కూడా మొదలు పెట్టలేదు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు మొక్కుబడిగా మూడు మీటింగ్ లు పెట్టారు.

కానీ ఇంకా ప్రజల్లోకి వెళ్లలేదు. ఈ ఎన్నికలను బీజేపీ కీలక నేతలు కూడా సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు. బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ లాంటి కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడట్లేదు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంది కానీ ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం కూడా ఆలస్యమే చేసింది. అక్కడి నుంచే అన్నింటా వెనకబడిపోయింది. ఈ బాధ్యత కిషన్ రెడ్డిదే అన్నట్టు మాట్లాడుతున్నారు బీజేపీ కీలక నేతలు. దీపక్ రెడ్డి అంతకు ముందు పెద్దగా మీడియా ఫోకస్ ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి కీలక నేతలు రంగంలోకి దిగేదాకా బీజేపీ అభ్యర్థికి పాపులారిటీ పెరిగేలా లేదు.

Tags

Next Story