BJP Telangana : బీజేపీ కొత్త అధ్యక్షుడెవరో తేలేది నేడే!

BJP Telangana : బీజేపీ కొత్త అధ్యక్షుడెవరో తేలేది నేడే!
X

బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అంశంలో ఉత్కంఠకు సోమవారం సాయంత్రమే తెరపడనుంది. సోమవారం సాయంత్రం 5.30గంటల కల్లా తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తెలిసిపోనుంది. ప్రస్తుతం రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, లక్ష్మణ్ తోపాటు డీకే అరుణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ఉన్నారు. ప్రధాన పోటీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్యనే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే నేతలు ఎంతమంది నామినేషన్లు వేసినప్పటికీ చివరకు అధిష్టానం సూచించిన నేత నామినేషన్ మాత్రమే రేసులో మిగలనుంది. మిగతా నేతలు సోమవారం సాయంత్రం 5 గంటలలోగా నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారమే బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు ఎవరో తేలనుంది. అయితే బీజేపీ అధిష్టానం ఆశీస్సులు ఏ నేతకు ఉండనున్నాయోనన్న ఉత్కంఠ ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అధ్యక్ష రేసులో ఉన్న నేతల్లో నెలకొని ఉంది. అధిష్టానం నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందోనన్న ఆశతో ఆశావహ నేతలు ఎదురు చూస్తున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం, నూతన అధ్యక్షుడి ప్రకటన మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే సమావేశంలో జరగనుంది. వేద కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ మండల అధ్యక్షుల నుంచి పైస్థాయి నేతలు మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి చంద్రశేఖర్ తివారి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్ ఆదివారం వేద కన్వెన్షన్లో సమావేశం నిర్వహించారు.

Tags

Next Story