ఆచార్య జయశంకర్ ఘాట్ నిర్మాణంపై వివాదం

తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ఆచార్య జయశంకర్ ఘాట్ నిర్మాణం బీజేపీ-టీఆర్‌ఎస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. హన్మకొండ నగరంలోని సిద్ధేశ్వర ఆలయ ప్రాంతంలో జయశంకర్ ఘాట్‌ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు.. వినయభాస్కర్‌తోపాటు అధికారులను అడ్డుకున్నారు. తమకు అనుకూలంగా కోర్టులో తీర్పు వచ్చిందని.. సుప్రీం కోర్టు స్టేటస్‌కో ఇచ్చిందని వారంటున్నారు. దీంతో అధికారులు, అర్చకులకు మధ్య వాగ్వాదం జరిగింది.
జయశంకర్ ఘాట్ ఉన్న శ్మశాసన వాటిక స్థలం సిద్ధేశ్వర ఆలయానికి చెందిన భూమి అని ఆలయ అర్చకులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. జయశంకర్ ఘాట్ నిర్మాణం పేరుతో టీఆర్‌ఎస్ నేతలు దేవాదాయ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వందేళ్ల నుంచి గుడి స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. అయితే గతంలో అనేకసార్లు ఈ స్థలంపై చాలా వివాదాలు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వాదన మరోలా ఉంది. వారసత్వంగా వచ్చిన స్థలాన్ని జయశంకర్ కుటుంబీకులే శ్మశాన వాటికకు దానం చేశారంటున్నారు ప్రభుత్వం చీఫ్ విప్ వినయభాస్కర్. జయశంకర్ చివరి కోరిక మేరకు జయశంకర్ ఘాట్ నిర్మాణం చేపడుతున్నట్లు వినయభాస్కర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఆచార్య జయశంకర్ ఘాట్ నిర్మాణాన్ని రాజకీయం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com