Operation Aakarsh : ఆపరేషన్ ఆకర్ష్ అంటున్న బీజేపీ.. పుపోరులో కొత్త వ్యూహం..

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది బీజేపీ. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండటంతో.. ఈసారి అర్బన్ ఏరియాల్లో తన బలం ఎంతుందో నిరూపించుకోవాలని కమలనాథులు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీకి ప్రధానంగా అర్బన్ ఓటర్ బేస్ ఉందన్న వాదన వినిపిస్తోంది. కానీ అది మాటల్లోనే మిగిలిపోకుండా, ఎన్నికల ఫలితాల్లోనూ చూపించాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు బీజేపీ ముందున్న పెద్ద ఛాలెంజ్. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీకి మరో సమస్య ఎదురవుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది.
ఈ క్రమంలోనే బీజేపీ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అదే ‘ఆపరేషన్ ఆకర్ష్’. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి, వారిని బీజేపీలోకి ఆహ్వానించడం ఈ ప్లాన్‌లో ప్రధాన భాగం.
ఆయా పార్టీల్లో టికెట్లు రాకపోవచ్చన్న అనుమానంతో ఉన్న నాయకులను ముందుగానే సంప్రదించి, బీజేపీ తరఫున పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరికీ టికెట్ వస్తుందో స్పష్టత లేకపోవడంతో.. చాలామంది నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. వారిని పార్టీలోకి తీసుకుని, నేరుగా టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలన్నదే కమలనాథుల వ్యూహం.
ఇలా చేస్తే ఒకవైపు అభ్యర్థుల సమస్య తీరుతుందని, మరోవైపు ప్రత్యర్థి పార్టీల బలం కూడా తగ్గుతుందని బీజేపీ లెక్క. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో స్థానికంగా పట్టు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే.. ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయన్న ఆశలో ఉంది. అయితే ఈ ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన నాయకులను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

