TG : ఉనికిని కాపడుకోడానికే బీఆర్ఎస్ విమర్శలు : మంత్రి తుమ్మల

ప్రజలకు దూరమైన బీఆర్ఎస్..ఉనికిని కాపాడుకోడానికి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రైతుల పేరుతో ఓట్లను దండుకున్న బీఆర్ఎస్ పదేళ్లలో రుణమాఫీని అరకొరగానే అమలు చేసిందని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో రుణమాఫీ చేసినట్లు చెప్పారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని.. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు వివరించి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ప్రభుత్వం నెల రోజుల్లోపే రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని తుమ్మల తెలిపారు. గత ప్రభుత్వం మాత్రం విడతలవారీగా ఆలస్యంగా రుణమాఫీ చేయడంతో అది వడ్డీలకే సరిపోయిందని సెటైర్ వేశారు. ప్రస్తుతం రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే చేస్తామని హామీ ఇచ్చారు. రూ.2లక్షలకు మించి ఉన్న రుణాలను రైతులు బ్యాంకులకు చెల్లించిన తర్వాత వారి ఖాతాల్లలో జమ చేస్తామన్నారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో వివరాలు టాలీ కాకుంటే రైతుల నుంచి అదనపు వివరాలను సేకరించి రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే బ్యాంకర్లను ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com