BRS : అసెంబ్లీ సమావేశాల టైమ్.. బీఆర్ ఎస్ కు డ్రగ్స్ కేసు చిక్కులు..

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా విషయాలపై నిలదీయాలని బీఆర్ ఎస్ ప్లాన్ వేస్తోంది. గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టుల దగ్గరి నుంచి మొదలు పెడితే.. మూసీ ప్రాజెక్టు, రైతు భరోసా, నిరుద్యోగం, ఆరు గ్యారెంటీలు ఇలా చాలా విషయాలపై కాంగ్రెస్ ను ఒత్తిడి చేయాలని బీఆర్ ఎస్ భావించింది. ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్లాన్ కూడా వేస్తోంది. ఇలాంటి సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు బీఆర్ ఎస్ కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ కు ఇప్పుడు ఈ కేసు పెద్ద అస్త్రంగా మారిపోయింది. బీఆర్ ఎస్ హయాంలోనే డ్రగ్స్ తెలంగాణలో విస్తరించిందని.. వారే దీనికి ఆజ్యం పోశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏకంగా కేటీఆర్ ను ఈ ఇష్యూలోకి లాగుతూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ సృష్టించిన వలలో బీఆర్ ఎస్ పడ్డట్టు అయిపోయింది పరిస్థితి.
కేటీఆర్ కూడా దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని చట్ట పరంగా శిక్షించాల్సిందే అని తేల్చి చెప్పారు. ఎవరో ఒకరు చేసిన పనికి పార్టీకి ఏం సంబంధం అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తాను ఎన్నడైనా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానంటూ తేల్చి చెప్పేశారు. కానీ కేటీఆర్ ఎన్ని చెప్పినా.. ఇది రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఇంకోవైపు బీజేపీ నేతలు కూడా బీఆర్ ఎస్ ను ఏకిపారేస్తున్నారు.
బీఆర్ ఎస్ హయాంలోనే తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా వచ్చిందని.. అప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలు ఎక్కువయ్యాయంటూ రఘునందన్ రావు లాంటి వారు ఆరోపిస్తున్నారు. దీంతో బీఆర్ ఎస్ డైలమాలో పడిపోయింది. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ను నిలదీయాలని భావిస్తే.. ఇప్పుడు అవతలి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చంది గులాబీ పార్టీకి. మరి అసెంబ్లీలో అనుకున్నట్టే కాంగ్రెస్ ను ఇరకాటంలో పెడుతారా లేదా అన్నది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
