BRS: బీఆర్ ఎస్ కు వరంలా హైడ్రా కూల్చివేతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని, పేదల గోడును పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మూసీ బాధితుల కష్టాలు చూస్తే ఎంతటి కఠిన గుండైనా కరిగిపోతుందని, సీఎం మాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ పేరు మీద రిసార్టులు కట్టి ఏం ఉద్ధరిస్తారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి హైదర్షాకోట, లంగర్‌హౌస్ హాషింనగర్‌లలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న బాధితులను ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ దూకుడు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయంతో నిస్తేజంలో కూరుకుపోయిన బీఆర్ ఎస్ కు మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు వరంలా పనిచేస్తున్నాయి. పేదల ఇళ్లను కూలుస్తున్నారంటూ బీఆర్ ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి ఆందోళనలు చేస్తున్నారు. తమను గులాబీ పార్టీ రక్షిస్తుందనే ఆశతో బాధితులు బీఆర్‌ఎస్ నాయకులకు ఆశ్రయిస్తున్నారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ ఎస్ కు హైడ్రా దారి చూపింది. మూసీ నది ఒడ్డున ఉన్న పేదల ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ రాజకీయంగా బలమైన అస్త్రంగా మార్చుకోడానికి దోహదపడింది. బీజేపీ సైతం అదే రాగం అందుకున్నా బీఆర్ఎస్‌తో పోలిస్తే వెనకబడే ఉంది.
బీజేపీ వెనకపడిందా..?
తెలంగాణలో పార్టీ నాయకత్వం బలంగా లేకపోవడం, స్టేట్ పార్టీ చీఫ్ కిషన్‌రెడ్డి జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉండడంతో ఇక్కడి వ్యవహారాలపై ఫోకస్ పెట్టలేకపోయారని, ఆయన రాగానే ఆందోళనలు చేపడతామని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. పేదల ఇండ్లను బుల్డోజర్లు కూల్చడానికి వస్తే ముందుగా అవి తమ మీద నుంచే వెళ్లాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో రివ్యూ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిలతో సమీక్షించే అవకాశాలూ లేకపోలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com