BRS: అన్యాయం జరుగుతుంటే స్పందించరేం..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమైనా.. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదని మండిపడ్డారు. బనకచర్ల ఆపాలని ఏపీకి కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, సీఎం రేవంత్ కు ఏపీని ఆపటం చేతకాకుంటే.. అఖిలపక్షాన్ని తీసుకుని పోవాలన్నారు. సీఎం రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారన్న అనుమానం కలుగుతోందని, బనకచర్ల ద్వారా 200 టీఎంసీ లను తరలించుకుపోతుంటే.. రేవంత్ మౌనంగా ఉండటానికి కారణం ఏంటన్నారు.
పోలవరంపై సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించే కుట్ర జరుగుతోందని అన్నారు. గోదావరి బేసిన్‌లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీళ్లపై కూడా రేవంత్ ప్రభుత్వం ప్రశ్నించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారన్నారు.
ప్రజలారా.. ఆత్మహత్యలు వద్దు: హరీశ్ రావు
సంక్షేమ పథకాల్లో తమ పేరు లేదని కొందరు ఆత్మహత్యా యత్నం చేయడంపై బీఆర్ఎస్ స్పందించింది. "ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దు" అని తెలంగాణ ప్రజలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com