Malreddy Ramreddy : ఎల్బీనగర్ చెరువుల కబ్జాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండదండలు

Malreddy Ramreddy : ఎల్బీనగర్ చెరువుల కబ్జాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండదండలు
X

బైరామల్ గూడ చెరువు కబ్జాకు సంబంధించి రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు హైడ్రా కమీషనర్ రంగనాథన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన హైడ్రా కమీషనర్ రంగనాథన్ గారు తన అధికార బృందంతో కలిసి చెరువును పరిశీలించి కబ్జా అయిన స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరలో ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. చెరువు పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను త్వరితగతిన తొలగించేందుకు చర్యలు చేపడతామని, ఇందుకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరొకసారి ఎల్బీనగర్ లో పర్యటించి అన్ని చెరువులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ గారు తెలిపారు.

బైరామల్ గూడ చెరువు కబ్జా గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్ గిరి ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీవ్రంగా స్పందించడం జరిగిందని మల్‌రెడ్డి రాంరెడ్డి గారు తెలిపారు. బైరామల్ గూడ చెరువును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తన అనుచరులు కబ్జా చేయడం వల్లనే హస్తినాపుర డివిజన్ రెడ్డి కాలనీ తో పాటు 150 కాలనీల నుండి వచ్చే వరద నీరు వివిధ కాలనీలలోని ఇండ్లకు చేరుతుందని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండదండలతో చాపల చెరువు, బైరామల్ గూడ చెరువులతో పాటు ఎల్బీనగర్ లోని ఇంకా కొన్ని చెరువులు కబ్జా చేసి, ప్లాట్లు చేసి అమ్ముకున్నారని మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ఆరోపించారు. ఎల్బీనగర్ లోని చెరువులను పరిరక్షించడానికి అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టి, పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Next Story