TG : బీఆర్ఎస్ విషం చిమ్ముతోంది.. సీఎం రేవంత్ ఫైర్

రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరాకుండా పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పినా మార్పు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన బాధ ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అందుకే అసెంబ్లీలో ప్రతి సందర్భాన్ని రచ్చరచ్చ చేస్తున్నారని, అనుభవమున్న సభ్యులు సైతం అసహనంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
రాజకీయ పార్టీ అంటే.. వారి లక్ష్యం కేవలం అధికారం మాత్రమే... కానీ ప్రజల మద్దతు, సామాజిక స్పృహ, బాధ్యత కూడా అవసరమని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించిన జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల మద్దతుతో కాంగ్రెస్ సాగిస్తున్న ప్రజాపాలనను చూసి ఓర్వేలేక పోతున్నారని, ప్రతి కార్యక్రమాన్ని తప్పుబడుతూ విషం చిమ్మే ప్రయత్నం. చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అసహనం అసెంబ్లీ వేదికగా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రతిపక్ష స్థానంలోనైనా భారాస నేతలు క్రియాశీలక పాత్ర పోషిస్తారని, ప్రభుత్వానికి విలువైన సూచనలు, సలహాలు ఇస్తారని ఆశించామని వ్యాఖ్యానించారు.
అది కూడా చేతగాని భారాస నేతలకు ఇక ప్రజాక్షేత్రంలో స్థానం లేదని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం కష్టమేనని సీఎం తేల్చి చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వారికి స్థానం ఉండదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వారికి అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com