BRS : వరంగల్ సభకు ఎడ్లబండ్లపై బయల్దేరిన బీఆర్ఎస్ నేతలు

గులాబీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొండంత అభిమానంతో వరంగల్ పార్టీ రజతోత్సవ సభకు ఐదు రోజుల ముందే ఎండ్ల బండ్లపై యాత్ర ప్రారంభించారు అభిమానులు. సాహసోపేతమైన యాత్ర అని.. ఎడ్లబండ్లలో వరంగల్ వెళ్ళడం హర్షణీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించి మాట్లాడారు. 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25 లో అడుగుపెడుతున్న బిఆర్ఎస్ పార్టీ సభకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా వుందన్నారు. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బిఆర్ఎస్ రజతోత్సవ సభజరగబోతుందన్నారు.
బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నారని తెలిపారు నేతలు. రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అందుకే కెసిఆర్ మీద అభి మానంతో బిఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరినట్లు చెప్పారు. ఎల్కతుర్తి మట్టిని తాకి, రజతోత్సవ సభను తిలకించి కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com