CM Revanth Reddy : రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని అన్ని తండాలకు మండల కేంద్రాల నుంచి బీటీ రోడ్లు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. జనం శిక్షించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదు. బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం రేవంత్ తెలిపారు.
ఆర్టీసీ బకాయిల ఇష్యూ..
-ఆర్టీసీ బకాయిలపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై అపాయింట్ డేట్ సహా కార్మికుల యూనియన్ల పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ‘కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు? పీఆర్‌సీ బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? ఫిబ్రవరి 10నే సీఎం చెక్కు చూపించారు. ఇంకా చెల్లించలేదు. నెక్లెస్‌రోడ్ నుంచి బస్‌భవన్‌కు చెక్కు ఎప్పుడు చేరుతుంది? ఆర్టీసీ కార్మికులతో అదనపు గంటలు పనిచేయిస్తున్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలోనే యూనియన్లను రద్దు చేశారని.. ఇప్పుడు వారే పునరుద్ధరణ గురించి అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వమే వాడుకున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోందని చెప్పారు. కొత్త బస్సులను కొంటున్నామని.. తొందరలోనే 3,035 మంది ఉద్యోగులను నియమిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com