kaleshwaram : కేంద్రం- తెలంగాణ ప్రభుత్వం మధ్య కొత్త పంచాయితీ..?

kaleshwaram : కేంద్రం- తెలంగాణ ప్రభుత్వం మధ్య కొత్త పంచాయితీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు మారుతున్నట్టే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాల్ని కాగ్ తనిఖీ చేయడం, ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారి హైదరాబాద్ రావడం లాంటివన్నీ ఏదో జరుగుతోందనే చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఢిల్లీ వచ్చిన ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ వివరాలు సేకరిస్తున్నారు. కాళేశ్వరం అంచనా వ్యయం, సవరించిన అంచనాలు, తీసుకున్న రుణాలు, జరిగిన పనులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై ఆ టీమ్ ప్రధానంగా ఆరా తీస్తోంది. ఉన్నట్టుండి ఈ తనిఖీలు ఎందుకు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు చేసిన పనులు, అందుకు ఖర్చు పెట్టిన నిధులు, ప్యాకేజీల వారీగా నిర్మాణానికి సంబంధించి ఎంత వ్యయంతో అనుమతులు ఇచ్చారు..? తరువాత వాటిని ఎందుకు పెంచాల్సి వచ్చింది అనే అంశాలపై కాగ్ బృందం ఆరాతీసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలించి మోటార్లకు ఎంత వెచ్చించిందీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇతర పరికరాలకు ఎంత ఖర్చయిందో వివరాలను కన్నెపల్లి పంప్ హౌస్‌లో సేకరించారు.
ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది కాగ్ టీమ్.. నిర్మాణ అంచనా వ్యయం, సవరించిన అంచనాలు, బ్యారేజీ లోతు వంటి వివరాలు అడిగి తెలుసుకుంది.. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కాగ్ బృందం గత ఏడాది జులై నుంచి ఆడిట్ ప్రక్రియ ప్రారంభించింది..ఆగస్టు 6న కాగ్ హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ తన బృందంతో కలిసి జలసౌథ వచ్చి ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ నుంచి వివరాలు సేకరించారు. అదేనెల 20న ఇన్‌స్పెక్టర్ అధికారి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. ఆ వివరాల ఆధారంగా 4 నెలల క్రితం కాల్ ఆడియో విభాగానికి సంబంధించి ప్రత్యేక బృందాలు ప్రాజెక్టు పలు ప్యాకేజీలను సందర్శించి చేసిన ఖర్చుకు సంబంధించిన రికార్డులు, నిర్వాసితుల స్థితిగతుల అధ్యయనానికి సామాజిక సర్వే నిర్వహించారా..? అనేది ప్యాకేజీల వారీగా సమాచారం సేకరించారు.
నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీ లకోసం ఆర్థిక సంవత్సరం వారీగా ఖర్చు చేసిన మొత్తం ఇంకా ఎంతమందికి పరిహారం ఇవ్వాల్సి ఉందనే వివరాలు తెలుసుకున్నారు. అదనపు టీఎంసీ కోసం చేసే ఖర్చు, ఆ పనుల వివరాలు, అలాగే ప్రాణహిత-చేవెళ్ల నుంచి కాళేశ్వరంగా రీడిజైన్ చేయడానికి దారితీసిన పరిస్థితులు, తదితర వివరాలు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులను కాగ్ బృందం కోరింది. మొత్తంగా 2015-16ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులు, ప్రాజెక్టుకు జారీ అయిన అనుమతులు, మల్లన్నసాగర్ రిజర్వాయర్‌పై నేషనల్ ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో సర్వే చేయించారా లాంటి అంశాలపై కాగ్ అధికారులు వివరాలు సేకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com