TG : తెలంగాణ కులగణన దేశ చరిత్రలో నిలిచిపోతుంది : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి గురువారం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధమైన పాలసీ అమలు చేయాలో కులగణన కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం రాష్ట్రాన్ని ఎక్స్ రే తీయాలని.. అందులో భాగంగానే కులగణన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శనీయంగా కులగణన సర్వే కార్యక్రమం ఉంటుందని అన్నారు. నవంబర్ 30 వరకు కులగణన సర్వే జరగనుందని.. 80 వేలకు పైగా ఎన్యుమరేటర్లు సర్వే చేస్తున్నారని తెలిపారు. ధాన్యంలో 17 శాతం తేమ ఉంటేనే వడ్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com