Medical Colleges: మెడికల్ కళాశాలల కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి..

Medical Colleges: మెడికల్ కళాశాలల కేటాయింపుల్లో ఏపీ, తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపింది. దేశవ్యాప్తంగా గత 8 ఏళ్లలో 157 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయగా... తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదు. ఏపీ ప్రభుత్వం 16 మెడికల్ కళాశాలలు కోరగా మూడు మాత్రమే మంజూరు చేసి 585 కోట్లు విడుదల చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఇవి వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ ఇనగంటి ఆర్టీఐ ద్వారా మెడికల్ కళాశాలల వివరాలు కోరగా ఆరోగ్యశాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
కొత్త మెడికల్ కళాశాలల్లో అత్యధికంగా యూపీకి 27, రాజస్థాన్‌కు 23, మధ్యప్రదేశ్‌కు 14 కాలేజీలను కేంద్రం కేటాయించింది. అలాగే ప్రస్తుతమున్న మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపుదలకు 15 రాష్ట్రాలకు 2451 కోట్లు కేటాయించగా, అందులో తెలంగాణకు ఒక్కరుపాయి కూడా రాలేదు. కేంద్ర ఆరోగ్యశాఖ కింద పనిచేస్తున్న మెడికల్ ఎడ్యుకేషన్-2 విభాగం 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వివిధ రాష్ట్రాలకు 24వేల 505.19 కోట్లు విడుదల చేయగా... తెలంగాణకు 42.75 కోట్లు, కేరళకు 36.96 కోట్లు మాత్రమే కేటాయించింది.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలలోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. కొత్త కోర్సులకు రెండు దశల్లో 1743 కోట్లు కేటాయించగా, తెలంగాణకు కేవలం 42.75 కోట్లు మాత్రమే కేంద్రం నుండి నిధులు వచ్చాయి. మొత్తంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు లోనూ, కొత్త పీజీ కోర్సులు, ఎంబీబీఎస్ సీట్ల పెంపు, పీజీ సీట్ల పెంపులోనూ తెలంగాణకు అన్యాయం జరిగినట్లు ఆర్టీఐ సమాచారంతో స్పష్టమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com