తెలంగాణపై బాబు ఫోకస్.. టీ-టీడీపీ అధ్యక్షుడి కోసం కసరత్తు..!

తెలంగాణపై బాబు ఫోకస్.. టీ-టీడీపీ అధ్యక్షుడి కోసం కసరత్తు..!
పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ రాజీనామా, తెలంగాణలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా భేటీలో చర్చించారు.

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ రాజీనామా, తెలంగాణలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా భేటీలో చర్చించారు. త్వరలోనే పార్టీ కార్యచరణ రూపొందిస్తామని టీడీపీ నేత నర్సిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో చంద్రబాబు సమావేశం కానునట్లు తెలిపారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందని నర్సిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ రాజీనామాతో ఇప్పుడా పదవి ఖాళీ అయ్యింది. తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఎల్‌.రమణ టీడీపీలోనే కొనసాగుతు వస్తున్నారు. 2018లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి జగిత్యాల నుంచి పోటి చేస్తారనే ప్రచారం జరిగినా.. అప్పటి పరిస్థితుల అనుకూలించక టీడీపీలోనే ఉండిపోయారు. ఇక ఇప్పుడు టీడీపీకి గుడ్‌ బై చెప్పి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇటీవలే సీఎం కేసీఆర్‌తో ఎల్‌. రమణ మంతనాలు జరిపారు. అలాగే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేసీఆర్‌ని కలిసిన రమణ గంటకు పైగా చర్చలు జరిపారు. గత ఏడేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కేసీఆర్‌తో రమణ చర్చించారు. పార్టీలో తగిన గుర్తింపుతో పాటు.. రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో రమణ టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ.. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు.

తెలంగాణలో పార్టీ క్యాడర్‌ చేజారిపోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తన నివాసంలో ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలను తీసుకుని తెలంగాణ అధ్యక్షుడిని ప్రకటించే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story