Konda Surekha : కొండా సురేఖలో మార్పు.. వరుస క్షమాపణలు

మంత్రి కొండా సురేఖలో మార్పు వచ్చిందా.. వివాదాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా.. ఈమధ్య ఆమె ప్రవర్తిస్తున్న తీరును చూస్తే అందరికీ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో మనకు తెలిసిందే. ఆమె ఒకటి అనుకుంటే దాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అలా దూకుడుగా మాట్లాడటం కూడా ఆమెను చాలా సార్లు వివాదాల్లో పడేసింది. ఆ మధ్య నాగార్జున ఫ్యామిలీ మీద, సమంత మీద చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం లేపాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడంపై హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున హైకోర్టులో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేసు కూడా వేశారు. ఇప్పటికే పలు దఫాలు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. రేపు మరోసారి హైకోర్టులో ఈ కేసు పై విచారణ జరగబోతోంది.
ఇలాంటి టైం లో కొండా సురేఖ అర్థరాత్రి ఓ షాకింగ్ ట్వీట్ చేసింది. నాగార్జునకు క్షమాపణలు చెప్పింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు అందులో తెలిపింది. అంతేకాకుండా తన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు రాసుకొచ్చింది. ఆమె ఇలా క్షమాపణలు చెప్పడాన్ని బట్టి చూస్తే వివాదాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ గానే సీఎం రేవంత్ రెడ్డికి కూడా క్షమాపణలు తెలిపింది. సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల తాను క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని చెప్పింది. అంతేకాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఉన్న విభేదాలకు కూడా చెక్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి కొండా సురేఖ ఈ మధ్య తన వివాదాలకు పులిస్టాప్ పెడుతోంది. మీడియా ముఖంగానే అందరికీ క్షమాపణలు కూడా చెబుతోంది. ఎక్కువమందితో శత్రుత్వం పెంచుకుంటే తనకే మంచిది కాదని ఆమె అర్థం చేసుకున్నట్లు ఉంది. తనకు కావాల్సిన మంత్రి పదవి ఎలాగూ ఉంది కాబట్టి.. ఎలాంటి వివాదాలకు పోకుండా తన పని తాను చేసుకుంటే బెటర్ అని సురేఖ డిసైడ్ అయింది. అందుకే ఒక మెట్టు దిగి మరి క్షమాపణలు చెబుతోంది. మరి ఆమె క్షమాపణలు చెప్పింది కాబట్టి నాగార్జున వెనక్కు తగ్గుతారా.. లేదంటే చట్టపరంగానే తేల్చుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

