Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డికి థాంక్యూ.. కార్మికుల సమస్యలపై చిరు ట్వీట్

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు సరిదిద్దుకున్నాయి. గత 18 రోజులుగా సినీ కార్మికుల సమ్మెతో ఆగిపోయిన షూటింగులు మళ్ళీ మొదలు కానున్నాయి. తమకు 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్ తో కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి కి కార్మిక సంఘాలకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో సమ్మె కొనసాగుతూ వచ్చింది. చివరకు ప్రభుత్వ చొరవతో చర్చలు సఫలం కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
"ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యంగా ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నా. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి సీఎం గారు తీసుకొంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా' అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
కాగా, సినీ కార్మికులు 30 శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేయగా..రోజుకి రూ.2 వేల లోపు వేతనాలు పొందుతున్న వారికి మూడేళ్లలో దశలవారీగా 22.5 శాతం, రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనాలు పొందుతున్న కార్మికులకి 17.5 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకరించింది. వర్కింగ్ కండిషన్ల విషయంలోనూ రాజీ కుదరడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com