CHILD ABUSE: అది నోరేనా... ప్రముఖల మండిపాటు

ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోకు ప్రణీత్ హన్మంతు అనే ప్రముఖ యూట్యూబర్, అతడితోపాటు మరో ముగ్గురు కలిసి.. వికృతమైన లైంగిక కోణంలో చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. వీరు నలుగురు సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్‌హన్మంతు బృందం వీడియో చూసిన హీరో సాయిధరమ్ తేజ్.. తొలుత ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా, ప్రమాదకరంగా మారిందని.. దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి రాక్షసులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా సాయిధరమ్‌తేజ్ కోరారు.
హీరో మంచు మనోజ్ కూడా తన ఎక్స్ ఖాతాలో యూట్యూబర్ ప్రవీణ్ హనుమంతుపై విరుచుకుపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో పాటుగా టెక్సస్ అధికారులు, యుఎస్ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేసి ప్రణీత్ హన్మంతుపై చర్య తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై హీరో నారా రోహిత్ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఆ యూట్యూబర్ల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారు. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సదరు యూట్యూబర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రణీత్ హన్మంతుతో పాటు మిగతావారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని.. నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ రవిగుప్తా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటున్నామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఇక.. హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టేవారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని ఆమె తెలిపారు.జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ కూడా దీనిపై స్పందించారు. ‘‘తండ్రీకూతుళ్ల విషయంలో ఆ యూట్యూబర్లు ఇలా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడం నిజంగా నీచమైన విషయమన్నారు.
తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ వివాదానికి మూలమైన ప్రణీత్‌హన్మంతు బేషరతు క్షమాపణలు చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని.. హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్లిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com