KCR: విజ్ఞతతో ఓటేయ్యండి లేకపోతే కష్టాలే

KCR: విజ్ఞతతో ఓటేయ్యండి లేకపోతే కష్టాలే
ప్రజలకు కేసీఆర్‌ పిలుపు.... పార్టీలు మారే వారిని నమ్మొద్దని సూచన

అవకాశాల కోసం పార్టీలు మారే వారిని నమ్మొద్దని అలాంటి వారు నట్టేట్లో ముంచడం ఖాయమని పాలేరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన కేసీఆర్‌ పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేట ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పార్టీలు, ఆయా నేతల వైఖరిని పరిశీలించి. ప్రజలు విజ్ఞతతో ఓటేయాలని కోరారు. భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లిచ్చామని గుర్తుచేశారు. ఒకప్పుడు ఎండిపోయిన పాలేరు ఇప్పుడు ఆకుపచ్చగా కనిపిస్తోందన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే, నియోజకవర్గం అంతటికీ దళితబంధు అందజేస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో కరవు ఉండదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమన్యా చేస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. భక్తరామదాసు ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వచ్చిన తర్వాత పాలేరులో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.


పదవుల కోసం అనేక మంది పార్టీలు మారతారని, మాట మారుస్తారని. పూటకో పార్టీ మారే వారిని నమ్మొద్దని, డబ్బు సంచులతో వచ్చే వారిని కాదు.. సర్వజనుల సంక్షేమం కోసం పనిచేసిన వారిని గెలిపించాలని కేసీఆర్ కోరారు. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ వంటి వారు ప్రశంసించారని గుర్తు చేశారు.కేసీఆర్‌ అన్యాయం చేశానని తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారని.. కానీ ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ మీద ఓడిపోయిన తుమ్మల.. మూలకు కూర్చుంటే, బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితుడనే ఉద్దేశంతో ఓడిపోయిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇచ్చా. ఎమ్మెల్సీని చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నిక వస్తే టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు. ఐదేళ్లు ఖమ్మం జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే.. ఆయన చేసింది గుండు సున్నా అని కేసీఆర్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేశారని, ద్రోహం చేసింది ఎవరని నిలదీశారు.


అనంతరం మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్‌ తెలంగాణ వచ్చినందునే మహబూబాబాద్ జిల్లా అయిందన్నారు. గత ప్రభుత్వాలు పెండింగ్‌ పెట్టిన.. పోడు భూములకు పట్టాలిచ్చామని తెలిపారు. పోడు రైతులకు కూడా రైతుబంధు, రైతుబీమా కల్పించామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసి, గిరిజన బిడ్డలను సర్పంచ్‌లను చేశామన్నారు. తర్వాత వర్ధన్నపేట సభలో పాల్గొన్న కేసీఆర్‌, 160 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. వర్థన్నపేటలో రింగ్‌రోడ్డుకోసం ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని, రమేశ్‌పై నేరుగా గెలవలేని వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ చేయబోమని ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నాని కేసీఆర్‌ తేల్చ చెప్పారు. షార్ట్‌కట్‌ పద్ధతిలో గెలవాలని చూసేవాళ్లు అబద్ధాలు చెప్తారని.. అలాంటి వారి మాటలు నమ్మొద్దన్నారు.

Tags

Read MoreRead Less
Next Story