రేపు దళిత బంధు పథకానికి సీఎం శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 15 మంది లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయ చెక్కులను అందించనున్నారు. ఇందుకు హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్ వేదిక కానుంది. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దళిత బంధు పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 15 మంది లబ్ధిదారులకు 10లక్షల చొప్పునఆర్థిక సహాయ చెక్కులను అందించనున్నారు. సుమారు లక్ష మందితో జరగనున్న ఈ బహిరంగ సభలో కేసీఆర్ దళితుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం అమలు చేసే తీరును, చేపట్టిన, చేపట్టనున్న ఇతర కార్యక్రమాలను వివరించనున్నారు. హుజూరాబాద్ మండలం శాలపల్లి ఇంద్రానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి దిశానిర్దేశం చేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ఉద్యమంగా మారుస్తూ.. నవశకానికి నాంది పలుకుతామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో సరికొత్త చరిత్రను సృష్టించి.. దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని పరిఢవిల్లేలా చేస్తామని అన్నారు. దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నదన్నారు.
ఈ పథకం కోసం ఇప్పటికే ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేసింది. హుజురాబాద్‌లో బహిరంగ సభ నేపథ్యంలో 820 బస్సుల్లో దళిత కుటుంబాలను తరలించనున్నారు. ఒక్కో బస్సును ఒక ప్రభుత్వ అధికారి పర్యవేక్షించనున్నారు. అందరు మంత్రులు, నేతలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 70 నుంచి 80 శాతం దళిత కుటుంబాలే లక్ష్యంగా సమీకరించనున్నారు. సభా స్థలి వద్ద రెండు హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. 2018 మే 10న ఇదే స్థలంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com