CM KCR Visit Yadadri Temple : యాదాద్రి ఆలయ నిర్మాణం పనులను సమీక్షించిన కేసీఆర్.. ఫిబ్రవరిలో..

CM KCR Visit Yadadri Temple : యాదాద్రి ఆలయ నిర్మాణం పనులను సమీక్షించిన కేసీఆర్.. ఫిబ్రవరిలో..
CM KCR Visit Yadadri Temple:సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనలో భాగంగా.. ప్రధానాలయాన్ని, నిర్మాణ పనులను పరిశీలించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూలైన్లను పరిశీలించారు సీఎం కేసీఆర్. బంగారు వర్ణంలో తయారుచేసిన స్తంభాలపై శంకుచక్రాలు, గోవింద నామాలు, ముఖ మండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించారు.

ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. వాటిని శరవేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్.. పనులు ఏ మేరకు వచ్చాయనే దానిపై స్వయంగా చూస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా గుడి నిర్మాణ పనులు పూర్తి అయ్యింది. యాదాద్రికి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి.

శివాలయం నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయ్యింది. కొండపై పుష్కరిణి కూడా పూర్తిస్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి.

మెట్లు, ఇతర నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇది కూడా మరో 15 రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు చెబుతున్నారు.

యాదాద్రి పునర్‌ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.. ఆలయ ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పనులు, కొనసాగుతున్న పనులపై ఓ అంచనాకు వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. నిజానికి ఫిబ్రవరిలోనే యాదాద్రి ఆలయాన్ని పునర్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావించారు.

అయితే పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అది వాయిదా పడింది. క్షేత్రస్థాయిలో పనుల జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం చినజీయర్ స్వామితో చర్చించిన ఆలయ ప్రారంభ తేదీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న యాదాద్రి పునర్నిర్మాణ పనులు దాదాపు ముగింపునకు వచ్చాయి. ఆధార శిల నుంచి శిఖరం వరకు కృష్ణరాతి శిలలతో, దేశంలోనే అత్యద్భుత కట్టడంగా రూపోందుతున్న అష్టభుజి ప్రాకార మండపాలు, కాకతీయ, యాలీ పిల్లర్లతో పాటు సప్తగోపుర సముదాయం భక్తులను అలరిస్తున్నాయి. అద్భుతమైన కళాఖండాలతో నిర్మితమవుతున్న ఆలయ గోపురాలు, ప్రాకారాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే గుట్ట చుట్టూ పచ్చదనం భక్తులకు ఆహ్లాదం పంచుతోంది.

సంపూర్ణ రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. ఆలయానికి వచ్చే భక్తులకు సంపూర్ణ రామాయణ ఘట్టాలు కళ్లకు కట్టేలా ఆలయ నిర్మాణాలపై చిత్రీకరిస్తున్నారు. ప్రధానాలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన కళ్యాణ మండప స్తంభాలపై సంపూర్ణ రామాయణ ఘట్టాలను చెక్కారు.

సీతారాముల జననం, రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్నుల విద్యాభ్యాసం, సీతా స్వయంవరం, సీతారాముల వివాహం, అరణ్య వాసం, లంకాదహనం ఇలాంటి ముఖ్యమైన రామాయణ ఘట్టాలన్నీ శిల్పాలపై చెక్కారు.

Tags

Read MoreRead Less
Next Story