TG : సీతారాం ఏచూరి మరణం పట్ల సీఎం రేవంత్, కేసీఅర్ సంతాపం

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్య సభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా,రాజ్య సభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగారని అన్నారు. సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com