ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్.. నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వచ్చే చాన్స్

సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణపై ఈసారి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మిగిలిన నామినేటెడ్ పదవుల పంపకం, కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు పార్టీలో కీలక పదవుల నియామకంపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలతో సమావేశం అయినప్పటికీ మంత్రిమండలి కూర్పుపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా మంత్రి వర్గ విస్తరణపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో వారం రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది.
హైకమాండ్‌తో భేటీ సందర్భంగా తెలంగాణలో కులగణనపై సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కులగణన పూర్తిచేయాలా.. ఎన్నికల తర్వాత చేయాలా అనేదానిపై అగ్రనేతలతో చర్చించనున్నారు. కులగణన తర్వాత ఎన్నికలకు వెళ్లాలంటే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైకమాండ్‌తో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com