CM Revanth : జానారెడ్డికి కీలక పదవి.. ఇంటికెళ్లి చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని కలవడం ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం తన నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరి మార్గ మధ్యలో బంజారాహిల్స్ లో ఉంటున్న జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు అరగంటకు పైగా వీరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని ఎంపిక చేయాలని భావిస్తున్న సీఎం రేవంత్ ఈ విషయాన్ని ఆయనకు ముందస్తుగా చెప్పాలని మాత్రమే వెళ్లి ఆయనను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. తన నివాసానికి వచ్చిన రేవంతు జానారెడ్డి దంపతులు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు.
ప్రభుత్వం తనను సంప్రదిస్తే ఎటువంటి సలహాలు అయినా ఇవ్వడానికి సిద్ధమని జానారెడ్డి బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. జానారెడ్డి చేసిన ఈ ప్రకటనకు కొనసాగింపుగా సీఎం రేవంత్ జానారెడ్డి ఇంటికెళ్లి కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే జానారెడ్డి చేసిన వ్యాఖ్యల వల్లే ముఖ్య సలహాదారు పదవిని కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ ఆయన దగ్గరకు వెళ్లారంటూ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ పదవిని జానారెడ్డి నిరాకరించకుండా నచ్చజెప్పేందుకే రేవంత్ జానారెడ్డిని కలిశారని చెబుతున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం మీడియా సమావేశం నిర్వహించి అందులో బీసీ కులగణన అంతా మాజీ మంత్రి జానారెడ్డి కనుసన్నల్లో జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై జానారెడ్డి కొంత మనస్థాపానికి గురయ్యారన్న ప్రచారం కూడా జరగడంతో ఆయన్ను రేవంత్ కలిసి ఈ తరహా ఆరోపణలను పట్టించుకోవద్దని హితవు పలికినట్టు సమాచారం.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, తెలంగాణాలో రెండురోజుల క్రితం వెలువడిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా ఇరువురు చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరి నడుమ కీలకమైన సమాలోచనలు జరిగాయని చెబుతున్నారు. గంట పాటు జానారెడ్డితో కొనసాగిన అంతరంగిక చర్చల్లో తెలంగాణాల నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై చర్చించినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com