REVANTH: బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్‌ ఫైర్‌

REVANTH: బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్‌ ఫైర్‌
X
కేసీఆర్‌ ఎప్పుడైనా ముంపు బాధితులను పరామర్శించారా అని ప్రశ్న

తెలంగాణలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా సీఎం రేవంత్‌రెడ్డి ఆ వివాదంలోకి కేసీఆర్‌ను లాగుతుండడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. బీఆర్‌ఎస్‌ను తూర్పారా పడుతూ రేవంత్‌ ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం అయినా రేవంత్‌ దూకుడును కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు. ఖ‌మ్మం, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన రేవంత్‌.. ముంపు బాధితులతో మాట్లాడారు. ఎప్పుడైనా వ‌ర‌ద‌ల్లో కేసీఆర్ ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శించాడా..? అని రేవంత్‌ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులు, ప‌నుల్లో ల‌క్ష కోట్లు సంపాదించిన ఆయ‌న ఓ రెండు వేల కోట్లు జ‌నాల‌కు ఇవ్వాలని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో మరణాలు సంభవించినా పోయాడా? నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్ష భీభత్సం కొనసాగుతుంటే కేటీఆర్‌ ఆమెరికాలో జల్సా చేస్తున్నాడుని రేవంత్‌ మండిపడ్డారు.

హరీశ్‌రావు నాలుగు రోజుల తర్వాత బయటకు వచ్చి, నాలుగు ప్రాంతాలు తిరిగి తమపై విమర్శలు చేస్తున్నాడని రేవంత్‌ ఎద్దేవా చేశారు. హరీశ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ చేసిన ఆక్రమణలు తొలగించాలని డిమాండ్‌ చేయగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వాటిని తొలగించడంలో చిత్తశుద్ధితో సహకరిస్తారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాను ఫామ్‌హౌస్‌లో పడుకున్నోడిలా కాదని, చెప్పింది చేస్తానని, చేసేదే చెప్తానని స్పష్టం చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వరదలు వచ్చాయని, ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

80 వేల పుస్తకాలు చదివానని చెప్పిన వ్యక్తి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే, అమెరికా పోయి కూర్చున్నాయన ఏదేదో ట్విట్టర్లో మాట్లాడుతున్నాడని కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే, ప్రజలు ఇంత బాధల్లో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్లు నోరు మెదపలేకపోతున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలవైపు కన్నెత్తి చూడటం లేదని ధ్వజమెత్తారు. వరదలపై హరీశ్‌రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదల ప్రభావం పెరిగిందని, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై హరీశ్ స్పందించాలన్నారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారని, వాటిని తొలగించాలని పువ్వాడకు హరీశ్ చెప్పాలని సీఎం సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి తాము ఆక్రమణలు తొలగిస్తామన్నారు.

Tags

Next Story