Revanth Reddy: ‘తెలంగాణ నుండి పోటీ చేయమంటూ సోనియాగాంధీకి CM రేవంత్‌ కీలక విజ్ఞప్తి

Revanth Reddy:  ‘తెలంగాణ నుండి పోటీ చేయమంటూ సోనియాగాంధీకి CM రేవంత్‌ కీలక విజ్ఞప్తి
ఢిల్లీ వెళ్లి మరీ రిక్వెస్ట్‌ చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీని కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో కలిసి సోనియాతో భేటీ అయిన సీఎం ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ పథకాల అమలుతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. దిల్లీ పర్యటనలో భాగంగా నీతి అయోగ్‌ వైస్‌ఛైర్మన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని కోరారు.

పార్లమెంటు ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీచేయాలని ఇటీవల తీర్మానం చేసిన పీసీసీ ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలి దృష్టికి తీసుకెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సోనియాతో ఆమె అధికారిక నివాసం 10-జన్‌పథ్‌లో సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ఈ సందర్భంగా ఆమెను కోరారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ నేతల విజ్ఞప్తిపై స్పందించిన సోనియాగాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సోనియాగాంధీకి వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి 5లక్షల నుంచి 10లక్షలకు పెంపు హామీలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు వివరించారు. 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను త్వరలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు సోనియాగాంధీకి పార్టీ నేతలు వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు వివరించారు. పథకాల అమలుతీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సోనియాగాంధీ అభినందించారు.

దిల్లీ పర్యటనలో భాగంగానీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్దికి రావాల్సిన గ్రాంటు 1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మూసీ నది ముఖభాగం ప్రాంత అభివృద్దికి నిధులు ఇప్పించాలని కోరారు. ప్రపంచబ్యాంకు సాయం విడుదలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతోపాటు వైద్యా రోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు సహకరించాలని సుమన్‌బేరీని సీఎం కోరారు.

అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ్ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి రాహుల్‌ను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యారంటీల గురించి వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేలా చూడాలని వారు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story