TG : నా ఫ్యామిలీ కబ్జా చేసినా.. నేనే కూల్చివేయిస్తా : సీఎం రేవంత్‌రెడ్డి

ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తన ఫ్యామిలీ కబ్జా చేసినా.. కూల్చివేయిస్తానని, దానిపై ఆరోపణలు చేసిన కేటీఆర్ వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత10 ఏండ్లు ఏలిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడీని ఏర్పాటు చేసుకొని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారు. అక్కడికి ప్రజలను రానివ్వలేదు. మేం ప్రగతి భవన్‌ను .. ప్రజాభవన్‌గా మార్చాం. అక్కడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడి నుంచే విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. కానీ గత10 సంవత్సరాలు అప్పటి సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయంలో అందుబాటులో లేరు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు. 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నిలబెట్టుకున్నారు. ఆమె వల్లే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైంది. ‘2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్లు ఎన్నెన్నో నిర్మించాం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డాం’ అని గొప్పలు ప్రస్తావించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ తల్లికంటే వారికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఈ పాత విధానాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేపట్టింది. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజలకు పండగ రోజు. ఆరోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com