CM Revanth Reddy : దుర్గకు అండగా సీఎం రేవంత్ రెడ్డి

తల్లి ఆత్మహత్యతో ఒంటరైన బాలిక దుర్గకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్డా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మ హత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది.
ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వైద్యం, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com