CM Revanth : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. వరంగల్ సభకు రాహుల్‌కు ఆహ్వానం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఢిల్లీ వెళ్లనున్నారు. శనివారం హస్తినకు బయలుదేరి వెళ్తున్న సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగ్యారంటీలను ఇప్పటికే అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన రెండు లక్షల రుణ మాఫీ హామీ అమలుకు శ్రీకారం చుట్టిన అంశాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పార్టీ అగ్రనేతలకు వివరించనున్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ లోగానే అమలు చేస్తామన్న హామీనిచ్చామని కానీ జులై నెలలోనే ఈ హామీని అమలు చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచుకున్నామన్న అంశాన్ని వారు వివరిస్తారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో రైతు రుణమాఫీ హామీనిచ్చామో అదే ప్రాంగణంలో రాహుల్ గాంధీ సమక్షంలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకోవాలని సీఎం రేవంత్ ప్రణాళికలు వేశారు. ఢిల్లీ పర్యటనలో ఈ విషయం చెప్పి వరంగల్ లో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభకు రాహుల్ ను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం.
వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయోత్సవ సభను నిర్వహించుకుందామని రేవంత్ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com