TG : నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం

TG : నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం
X

హైదరాబాద్: విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రానుంది.. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ రెడ్డి బృందం చేరుకోనుంది.

ఈ నెల 3న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సారథ్యం లోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా లోని సియోల్‌ కి చేరుకున్నారు. దక్షిణ కొరియాలో రెండ్రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించారు.

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు.

అందులో భాగంగా కాగ్నిజెంట్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు.. వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్‌కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ నెల 5న తెలంగాణ సర్కార్‌తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికా లోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు.

పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్‌లు నిర్వహించి పలు కంపెనీ లను క్షేత్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి.

ఈ పర్యటనలో 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో, రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్​తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధుల తోనూ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌ తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు.

అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌ రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్​టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది..

Tags

Next Story