CM Revanth Reddy : సంక్రాంతికి ముందే విదేశాలకు సీఎం రేవంత్ పయనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వారాల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్న సీఎం రేవంత్ తొలుత ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయ తలపెట్టిన యంగ్ ఇండియా క్రీడా విశ్వ విద్యాలయానికి సంబంధించి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలిస్తారు. సీఎం రేవంతో పాటు ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడా విభాగం ఎండీ సోనీ బాల, క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి వెళ్లనున్నారు. నాలుగు రోజులపాటు (14వ తేదీ నుంచి 18 వరకు) ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటిస్తుంది.
తిరిగి ఈనెల 18వ తేదీన సింగపూర్ వెళ్లనున్న ముఖ్య మంత్రి రేవంత్ బృందం అక్కడ షాపింగ్ మాల్స్ ను, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలపై అధ్యయనం చేస్తుందని అధికారులు తెలిపారు. సింగపూర్లో జరగనున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని చెబుతున్నారు. అనంతరం 19వ తేదీన సింగ పూర్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్ బయలుదేరి వెళ్లనున్నారు. దావోస్ లో జనవరి 21 నుంచి 23వ తేదీ వరకు పర్యటించనున్న ఈ బృందం 'ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సులో పాల్గొంటుంది. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజులు పాల్గొనున్నారు. 2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com