Khairatabad : ఖైరతాబాద్‌ గణేషుడిని దర్శించుకున్న సీఎం రేవంత్‌

Khairatabad : ఖైరతాబాద్‌ గణేషుడిని దర్శించుకున్న సీఎం రేవంత్‌
X

గణపతి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి ఎంతో స్పెషల్. ఈ సారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్​ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. ఈ సారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇక ఈ వినాయకుడి తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో గవర్నర్లు తొలి పూజలో పాల్గొనేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా నేరుగా సీఎం పాల్గొన్నారు.

ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేష్‌ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ కమిటీ భావిస్తోంది. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Next Story