revanth: కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఏఐసీసీ చీఫ్ ఖర్గేను రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవనున్నారు.జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఖర్గేను రేవంత్ పరామర్శించనున్నారు. అలాగే మరికొందరు కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలిసే అవకాశం ఉంది.
పర్యటన అందుకేనా...?
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన పరామర్శించనున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించేందుకే రేవంత్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నొక్కిచెప్పారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వురుగా ఉండడంతో పిల్లల్లో ఆత్మన్యూనతా భావం ఏర్పేడదని.. దానిని తొలగించి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో దాదాపు 25 ఎకరాల్లో వంద కోట్ల రూపాయలతో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ప్రక్రియ ప్రారంభమైందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇవి ఉంటాయన్నారు. పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదని, విద్యా శాఖను నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయింపులూ నామమాత్రంగా పెట్టిందన్నారు. ఇప్పుడు విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందునే, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com