Hydra : సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవు : కమిషనర్ రంగనాథ్

బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ( Commissioner Ranganath ) స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. నేరస్థులు, నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తించవన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రంగనాథ్ గుర్తుచేశారు. హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు కోర్టులను ఆశ్రయించారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేస్తుందని, న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com