TG : మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. గతంలో నాగార్జున ఫ్యామిలీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఆ తర్వాత తన కూతురుతో వీడియో కాల్ లో మాట్లాడుతూ లిక్కర్ కు సంబంధించిన కామెంట్స్ చేశారు. తాజాగా ఆమె భర్త కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మంత్రిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కొండా సురేఖ తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ప్రదీప్ రావు ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామనే కొండా మురళి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదీప్ రావు కొండా సురేఖపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పటికే ఇదే విషయంలో ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడిన కొండా మురళి.. ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశామని వ్యాఖ్యానించారు. విపక్షాలకు ఇప్పుడు ఇదే ఆయుధమైంది. స్వయంగా మంత్రి భర్తే డబ్బులు ఖర్చు చేశామని చెప్పడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నన్నపునేని నరేందర్ అన్నారు. మంత్రిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com