TG : పంద్రాగస్టున రైతు రుణమాఫీ పూర్తి

రెండు విడతలుగా రుణమాఫీ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం పంద్రాగస్టు రోజున తుది విడత నిధులను విడుదల చేసేందుకు సిద్దమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిపారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ సంక్షేమ రాజ్యంలో రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో నిధులను సమ కూర్చుకుని రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఇప్పటికే రూ.12వేల కోట్లకు పైబడిన నిధులతో సుమారు 17లక్షలకు పైచిలుకు రైతులకు రుణమాఫీ జరిగిందని తెలిపారు తుమ్మల. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రూ. 2 లక్షల లోపు పంట రుణాలున్న ప్రతి రైతుకూ విముక్తి కల్పించి తీరుతామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి మంగళవారం సచివాలయంలో మంత్రి తుమ్మల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ఆయకట్టుకు నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు వరుసగా నాలుగేళ్లు రూ.25 వేల చొప్పున మాత్రమే రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు తుమ్మల. ఆ రుణ మాఫీతో ఎలాంటి ప్రయోజనం కలుగలేదనే భావన రైతుల్లో పాతుకుపోయిందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com