Minister Ponguleti : 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శనివారం భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పొంగులేటి స్పష్టం చేశారు.
పెండింగ్ 25.70 లక్షల దరఖాస్తులు
గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ‘గతంలో 25.70లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి పరిధిలో 1.35లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారఖాస్తుల పరిష్కారానికి ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీటిని వెంటనే పరిష్కరించాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, దళారుల ప్రమేయం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అని పొంగులేటి సూచించారు.
7 జిల్లాల్లో విలువైన భూములు
హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని.. ఈ జిల్లాల్లో లేఅవుట్ల క్రమబద్దీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. అప్లికేషన్ల పరిష్కారానికి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని పొంగులేటి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com