Congress : మాణిక్కం పోయి మానిక్ రావు వచ్చే....కానీ, వ్యవహారం తెగట్లేదే...!

హైదరాబాద్
Congress : మాణిక్కం పోయి మానిక్ రావు వచ్చే....కానీ, వ్యవహారం తెగట్లేదే...!
తెలంగాణా ఏఐసీసీ అధ్యక్ష పదవిలో మానిక్ రావు ఠాక్రే నియామకం... సీనియర్లకు తృప్తినిస్తోన్నా... అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో...

అన్ సెర్మోనియస్ ఎగ్జిట్(Unceremonious Exit) అన్ని పదం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసి, కీలక పదవి నుంచి ఉన్నపళంగా తొలగింపునకు గురై, ఒకింత అవమానకర రీతిలో బదిలీ అవ్వడం ఆ స్థాయి నేతకు ఓ రకంగా మాయని మచ్చే. ప్రయత్నిస్తే సునాయాసంగా అధికారం దక్కించుకో గల సత్తా ఉన్న తెలంగాణా రాష్ట్రం నుంచి పార్టీకి ఏమాత్రం గుర్తింపు లేని గోవా లాంటి రాష్ట్రానికి ఆయన్ను బదిలీపై పంపడం డిమోషన్ కిందే లెక్క.


ఆయనపై సీనియర్లకెందుకు ఆక్షేపణ ?

సొంత పార్టీ వారినే విమర్శిస్తూ, వారి సహనాన్ని పరీక్షించడంలో టీకాంగ్రెస్ నేతలు మరోసారి తమ ప్రతాపాన్ని ప్రదర్శించుకున్నారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివైనా పార్టీ సంస్ధాగత లుకలుకలు కార్యకర్తలను నిరాశకు గురిచేసేవిగా ఉన్నాయని స్పష్టమైంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం జరిగే క్రమంలోనే సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేవంత్ తమకు తగిన విలువ ఇవ్వడంలేదన్న భావనకు చేరుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోగా పార్టీలో రెండో స్ధాయి నేతల మద్దతు రేవంత్ కే ఉందని మాణిక్కం ఠాగూర్ అధిష్టానానికి నివేదిక ఇవ్వడం వల్లే అతడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, అప్పటి నుంచి ఆయన ఆగడాలు ఎక్కువ అయ్యాయని... దీని వల్లే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందన్నది వారి వివరణ.


మల్లికార్జున ఖర్గే రాకతో మారిన సమీకరణం

ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే రావడంతో సీనియర్లు నేరుగా ఆయనకు ఫిర్యాదు చేసారు. దాదాప ప్రతీ సీనియర్ రేవంత్ పోకడలను వ్యతిరేకించడం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీలో దిగువస్ధాయి నుంచి ఎదిగిన నేతగా సీనియారిటీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం, వారిని బుజ్జగింజే ప్రక్రియ తెలిసిన నేతగా వెంటనే దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపడం.... ఆయన హైదరాబాద్ లో సీనియర్లందరినీ కలవడం జరిగి పోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇప్పటికిప్పుడు పీసీసీని మార్చడం పార్టీకి మరింత ఇబ్బందికరంగా వుంటుందనీ, వేరే పీసీసీ అధ్యక్షుడు వచ్చినా మళ్ళీ వర్గ విభేదాలు తప్పవన్న ఆలోచనతో దిగ్విజయ్ మధ్యేమార్గంగా ఇంఛార్జ్ ను మార్చే పరిష్కారాన్ని సూచించారు.


మరి పరిష్కారం లభించినట్టేనా..

కాంగ్రెస్ వ్యవహారాలను తు.చ.తప్పకుండా ఫాలో అయ్యేవారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా వున్న కాంగ్రెస్ లో ఫిర్యాదులు, గ్రూపులు ఎలాగూ తప్పవు. ఓ వైపు బీజేపీ పుంజుకుంటోన్నతరుణంలో నాయకులూ, కార్యకర్తలూ చేజారకుండా ఉండాలంటే ప్రస్తుత పరిష్కారం కొంతమేరకు ఉచితమైనదే అనుకోవచ్చు. మాణిక్ రావు ఠాక్రే లాంటి అనుభవమున్న నేత నూతన అధ్యక్షుడుగా రావడంతో అటు సీనియర్లను, ఇటు రేవంత్ దూకుడునూ సమన్వయం చేసుకునే అవకాశముంది.



2004కు పూర్వం కూడా రాజశేఖర్ రెడ్డికి సీనియర్ల సహకారం పూర్తి స్ధాయిలో అందలేదు. కానీ ప్రజాసమస్యల పై పోరాటంలో ఉనికిని చాటుకుంటూ ఆయన ముందుకు సాగిపోయారు. ఏమైనా కలిసి కట్టుగా పోరాడితే, ఎవరిస్ధాయిలో వారు అభ్యర్ధులను గెలిపించుకుంటే, కేసీఆర్ వ్యతిరేక ఓట్లను బీజేపీకి వెళ్లకుండా అడ్డుకోగలిగి... 60 స్థానాల్లో గెలిస్తే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారనే కొత్త పోరు మొదలవుతుందన్నమాట.


Pradeep kumar Bodapatla

Input Editor, TV5.

Tags

Read MoreRead Less
Next Story