Revanth Reddy : సర్పంచ్ ఎన్నికలపై కాంగ్రెస్ లో తర్జన భర్జన..

ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇన్ని రోజులు వేచి చూసిన తర్వాత ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిర్వహించాలని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏదో ఒక క్లారిటీ వస్తేనే ఆ ఎన్నికల్లో పార్టీ పరంగా ఇవ్వాలా, లేదా ఇంకేదైనా చేయాలా అనేది తీర్పు తర్వాత ఆలోచించబోతున్నారు.
ఈ లోగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేస్తే పని అయిపోతుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ఎందుకంటే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు పోటీ చేయాలని కాంగ్రెస్ లో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రావడంతో.. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ లోని చాలామంది నేతలు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమ వద్ద ఉన్న డబ్బును సర్పంచ్ ఎన్నికల కోసం ఖర్చు పెడితే.. రేపు ఎంపీటీసీ లేదా జడ్పిటిసి ఎన్నికలకు ఏమి మిగలదు. పైగా సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసినవారికి కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ లేదా జడ్పిటిసి టికెట్లు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
పైగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఆ ఎన్నికల్లోనే వర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసేందుకు చాలా జిల్లాల్లో నేతలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న గ్రామాల్లో ఎవరో ఒకరు ముందుకు వస్తున్నా.. మేజర్ గ్రామపంచాయతీళ్లో మాత్రం బలమైన అభ్యర్థులు ముందుకు రావట్లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఎలాగోలా పెద్ద గ్రామాల్లో బలమైన అభ్యర్థులను ఒప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీసీల్లో బలమైన నేతలు మాత్రం సర్పంచ్ ఎన్నికలకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అంట. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ నుంచి రిజర్వేషన్ వర్తిస్తుందని ఆశిస్తున్నారు. దీంతో ఇప్పుడు వాళ్ళందర్నీ ఒప్పించడం లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలకు పెద్ద టాస్క్ అయిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

