T CONGRESS: తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్

కర్ణాటక రాష్ట్రంలో సాధించిన విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. కర్ణాటకలో సాధించిన విజయం తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారిపోయింది. అప్పటిదాకా అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన పార్టీ ఒక్కసారిగా బలం సంపాదించుకుంది. ఎడ మొహం పెడ మొహం గా ఉండే సీనియర్లు ఒక్కతాటిపైకి వచ్చారు. ఇదే నేపధ్యంలో కెసీఆర్ తీరును నిరసిస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు బయటకు వచ్చారు. కర్ణాటకలో ఎలాగో విజయం సాధించడంతో వారు కూడా కాంగ్రెస్ ఫోల్డ్ లోకి వచ్చారు.వారిని చాకచక్యంగా వారిద్దరిని పార్టీలోకి లాగేసుకున్నారు.
ఎటు చూసినా సానుకూల పవనాలు కనిపిస్తుండడంతో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే వేదికగా రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను కెసిఆర్ ఫ్యామిలీ సర్వ నాశనం చేస్తుందని ఫైర్ అయ్యారు.అంతేకాదు తెలంగాణ రాష్ట్రాన్ని తన సొంత జాగిర్ధారుగా కెసిఆర్ అనుభవిస్తున్నారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టును తన సొంత ఏటీఎం గా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీ వేర్వేరు కాదని సంచలన ఆరోపణలు చేశారు.
108 రోజుల పాటు సుదీర్ఘంగా పీపుల్స్ మార్చ్ నిర్వహించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజాగర్జన వేదికగా పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ భట్టిని అభినందించారు. ప్రత్యేకంగా శాలువా కప్పి సన్మానించారు. వెయ్యికి పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలహీనులకు అండగా నిలిచారంటూ భట్టిని రాహుల్ ప్రశంసించారు. ప్రజాగర్జన సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్‌గాంధీ పార్టీ కండువా కప్పి పొంగులేటిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ చేరికలతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణలో బీజేపీ పని ఖతం అయిందన్నారు రాహుల్ గాంధీ. ముక్కోణపు పోటీ అంటూ ఏమీ ఉండదు,కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ప్రధాన పోటీ అని స్పష్టం చేశారు. కర్నాటక తరహాలో బీఆర్‌ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ కాబట్టే పట్నా విపక్షాల సమావేశానికి ఆ పార్టీని పిలవలేదన్నారు.. బీఆర్‌ఎస్ వస్తే కాంగ్రెస్ విపక్షాల సమావేశానికి రాదని చెప్పామన్నారు. కేసీఆర్ అవినీతికి మోదీ ఆశీస్సులున్నాయన్నారు. ఆయన చేసిన స్కామ్‌లన్నీ మోదీ ఏజెన్సీలకు తెలిసినా ఏలాంటి చర్యలు లేవన్నారు.
ప్రజాగర్జన వేదికగా రాహుల్‌గాంధీ ఎన్నికల హామీలను గుప్పించారు.ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం సభలోనూ జనాకర్షక హామీలను ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను 4 వేల రూపాయలకు పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసులకు పోడు భూములు ఇస్తామని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com